1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (19:13 IST)

విశాఖపట్నం నుంచి శబరిమలకు ఆర్టీసీ సర్వీసులు

అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపికబురు చెప్పింది. విశాఖపట్నం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది.
 
ఆలయాన్ని సందర్శించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కోసం విశాఖపట్నం రీజియన్ నుంచి శబరిమలకి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ద్వారకా బస్ స్టేషన్ (ఆర్‌టీసీ కాంప్లెక్స్)లో ప్రత్యేక బస్సుల బుకింగ్ కోసం కౌంటర్‌ను ప్రారంభించారు.

విశాఖపట్నం ప్రాంతం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఇంద్రా, అమరావతి బస్సు సర్వీసులతో 5, 6, 7 రోజుల పర్యటనల ప్యాకేజీలను అయ్యప్ప భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

భక్తులు సందర్శించాలనుకున్న దేవాలయాల ఆధారంగా.. ఈ యాత్రలు ఉంటాయని.. దీనిని భక్తులు ఎంచుకోవాల్సి ఉంటుందని విశాఖ రీజియన్ అధికారులు తెలిపారు. భక్కులు ఎంచుకున్న పర్యటన ప్రకారం.. ఛార్జీలను తీసుకొని.. ఆయా మార్గాల్లో సర్వీసులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే.. ఎక్కడినుంచైనా ఆయా ప్రదేశాల నుంచి సర్వీసులను నడపుతామని అధికారి రవికుమార్ తెలిపారు. వివరాల కోసం భక్తులు 99592 25602, 73829 14183, 73829 21540 లేదా 99592 25594 కి ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పంచారామం, లంబసింగి, అరకు, దారమట్టం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వివరించారు.