గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:24 IST)

రైతులపై చంద్రబాబు, బీజేపీలది కపట ప్రేమ: సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టుగా..  చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు, అసత్యాలు వంటబట్టించుకున్నారని అన్నారు.

తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో చూసిన చీకటి రోజులను రైతులు ఇంకా మరచిపోలేదని గుర్తు చేశారు. శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన..  రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపిందని, రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..*
1. రాష్ట్రంలోని రైతాంగం పట్ల ప్రతిపక్ష నాయకులు వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్నారు. తమ హయాంలో రైతులకు స్వర్గంలా ఉండేదని.. ఇప్పుడు నరకంలా ఉందని చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. దెయ్యం మాదిరిగా చంద్రబాబుది వంకర బుద్ధి. మంచిని తప్పు అని చెప్పడం... తప్పును మంచి అని చెప్పడం ఆయనకు అలవాటు. మనం ఆక్సీజన్ ను పీలిస్తే.. దెయ్యాలు కార్బన్ డయాక్సైడ్ పీల్చినట్టు.. చంద్రబాబు చెడునే ఆస్వాదిస్తాడు.

తమ హయాంలో 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించినట్టు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ.. చంద్రబాబు సీఎం శ్రీ జగన్‌కు అబ్ధాలు, అసత్యాలతో రాసిన లేఖను చూసి ఆశ్చర్యపోయాం.
 
2. ఏదైనా ఆరోపణలు చేస్తే.. ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. పులి లేకున్నా... ఉన్నట్లు భ్రమ కలిగించేలా చంద్రబాబు చేష్టలు ఉన్నాయి. అబద్ధాలు మినహా ఇంకేమీ లేకుండా బక్కెట్ల కొద్ది బురద తెచ్చి... ప్రభుత్వంపై చల్లేస్తూ దాన్ని మీరే వదిలించుకోండి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన సహజ స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు.

ఎలాంటి పాలనా అనుభవం లేని పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు, ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు చూసి రెచ్చిపోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే... అసలు విషయం ఇది అని నచ్చచెప్పవచ్చు. మరి ఇన్నేళ్ల పాలనా అనుభవం ఉన్న బాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు హయంలో జరిగిన దారుణాలు రాష్ట్ర ప్రజల మస్తిష్కాల్లో ఇంకా చెరిగిపోలేదు.
 
3. వైఎస్‌ జగన్‌కు పాలనా అనుభవం లేకున్నా, నిజాయితీ, నిబద్ధత ఉంది. అతి తక్కువ కాలంలోనే సుపరిపాలన అందించి చూపించారు. అందుకే ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వానికి జేజేలు పలుకుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించారు. 

అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన పాలన అందరికీ కనిపిస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా  ఏదైనా ఒక విషయంపై ఆరోపణ చేద్దామంటే.. ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేవారు. ఏ  అంశానికి సంబంధించినది అయినా ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకున్న తర్వాతే మాట్లాడేవారు. 
 
4. అదే చంద్రబాబుకు డెబ్భై ఏళ్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. ఆయన అద్దం ముందు తనను తాను చూసుకుంటే, ఆయన నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఈ భూ ప్రపంచంలో ఇలాంటి అబద్ధాలతో కూడిన అడ్డగోలు రాతలు రాయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అవుతుంది. 

చంద్రబాబు హయాంలో 48 గంటల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నాడు. వాస్తవం ఏమిటంటే, చంద్రబాబు హయాంలో రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను,  ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టగానే చెల్లించారు. రైతులకు బకాయిలు పెట్టి, ఎగ్గొట్టడమే చంద్రబాబు ఘనత. 
 
5.  బాబు నాయుడు హయాంలో రబీలో జరిగిన ధాన్యం సేకరణ- రైతులకు చెల్లించిన మొత్తాలను అధికారుల నుంచి తెప్పించి చూస్తే.. వాస్తవాలు తెలుస్తాయి. 

టీడీపీ హయాంలో.. 
2014-15లో 18.91 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. 2015-16 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. 2016-17 లో 16.95లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. 2017-18లో 18 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. వీటికి సంబంధించి ఏటా సగటున రూ. 2 వేల కోట్లు వరకు రైతులకు చెల్లించారు. 

2018-19లో  27.52 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి, దానికిగాను రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ 4800 కోట్లలో వెయ్యి కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు దిగిపోయారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2019-20లో 34.74 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి రూ. 6,331 కోట్లు చెల్లించాం. అలానే, 2020-21లో రబీలో ఇప్పటివరకు 25.27 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి, ఇప్పటి వరకు రూ. 4,728 కోట్లు చెల్లించాం. ఈ ఏడాది మొత్తం 45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 
-ఆర్ బీకేలతో వ్యవసాయ ఉత్పత్తులను కల్లం దగ్గరే సేకరించాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరలు రావాలనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 
 
6. రైతులలో లేని ఆందోళనను ఉన్నట్టుగా సృష్టించి చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు మతి చలించిందేమో అనే అనుమానం వస్తోంది. ఎంఎస్‌పీ అంటే కనీస మద్దతు ధర అని కూడా చంద్రబాబుకు తెలుసో, తెలియదో అర్థం కావడం లేదు. చంద్రబాబు రాతలు చూస్తుంటే.. ఆయనకు తెలియకపోయినా, ఆయనకు స్క్రిప్ట్‌ రాసిన వారికి కూడా అవగాహన లేదనే అనుమానం వస్తోంది. 
 
7. కౌలు రైతులకు చంద్రబాబు హయంలో చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతుందేమిటో, రైతులకు ఎంత మంచి చేస్తున్నామో అన్నది వాస్తవంలో రైతులు కళ్ళారా చూస్తున్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ-క్రాప్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం.

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల ఖర్చు తగ్గించి వారి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి కల్లం లోనే పంటను సేకరిస్తున్నాం. రైతు తాను పండించిన పంటకు మార్కెట్‌లో మద్దతు ధర లేకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

రైతులు ఏవిధంగానూ నష్టపోకూడదని క్యాలెండర్‌ రూపొందుంచుకుని ప్రణాళికాబద్ధంగా ప్రతి ఏడాది రైతు భరోసా, పంట రుణాలు, బీమా వర్తింప చేస్తోంది. చిన్నపాటి అవకతవకలు జరిగినా దానికి సంబంధించి సహాయం చేయడానికి, ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దళారుల వల్ల రైతు నష్టపోడకూడదని ఆర్బీకేలను తీసుకువచ్చాం.
 
8. టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం... దానికి రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్‌ నర్సింహరావులు వంత పాడటం చూస్తున్నాం. అప్పుడప్పుడు పవన్‌ కల్యాణ్‌ వీరితో జత కలుస్తారు. బీజేపీ వారిని మేము సూటిగా అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా?

ప్రభుత్వంపై విమర్శలు చేసే రాష్ట్ర బీజేపీ పెద్దలు.. కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి.. ఆ క్రెడిట్‌ వాళ్లు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి కూడా బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన ఢిల్లీ పర్యటనలో కూడా రాష్ట్రానికి రావాల్సిన రూ. 3300 కోట్ల పౌర సరఫరాల బకాయిలను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
 
హేతుబద్ధత ఉండాలనే నూతన ఆస్తి పన్ను విధానం
9. ఇకా ఆస్తి పన్ను విషయంలోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు. అధికారం పోయింది కాబట్టి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. మరి బీజేపీకి ఏమైంది. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ యాక్ట్‌ కింద కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘం సూచించిన వాటినే రాష్ట్రం అమలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని మీరు అమలు చేయడం లేదా?

ఇప్పటివరకూ దళారుల వల్ల రెంటల్‌ వాల్యూ తగ్గించి చూపించుకున్నారు. ఇప్పటికైనా ఒక హేతుబద్ధత ఉండాలనే ఈ విధానాన్ని తీసుకువచ్చాం. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం రూ. 186 కోట్లే. 
-ఆస్తి పన్ను విషయంలో రేషనలైజ్ విధానంలో హేతుబద్ధతతో చేయమని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆస్తి పన్ను నూతన విధానాన్ని కర్ణాటకలో అమలు చేయలేదా.. మహారాష్ట్రలో చేయలేదా.. ? గుజరాత్ లో అమలు చేయలేదంటే.. ఎలా..? అక్కడ ఇంకోరకంగా బాదుతున్నారేమో..!. మరి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పెట్రోలు, డీజిల్ ధరలను రోజూ పెంచుతోంది కదా..!. 
- ఆస్తి యజమానులు ఎవరూ కూడా వర్రీ కావడం లేదు.. అనవసరంగా బీజేపీ, టీడీపీలే రాద్ధాంతం చేస్తున్నాయి. 
 
10. సంక్షేమం కూడా అభివృద్ధి అని రుజువు చేస్తున్న పరిపాలన మాది. మా ప్రాధామ్యాలు మాకు ఉంటాయి. రైతు శ్రేయస్సు, విద్య, వైద్య రంగాలకు అగ్ర స్థానం కల్పించాం. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చేస్తున్న పాలనను చూసైనా చంద్రబాబు నేర్చుకోవాలి. చంద్రబాబుది ఆదినుంచి దెయ్యం ఆలోచనే. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన రకం.

అబద్ధాలనే వేదిక చేసుకుని విమర్శలు చేయడం కాదు. అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు చూసుకోండి. మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టే... మీరు చేసే చిన్న విమర్శను అయినా పెద్ధ స్థాయిలోనే తిప్పి కొడతాం. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి మమ్మల్ని గిల్లబోతే... మీరు గాడిద తన్నులు తింటారు.
 
11. ఇక రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్‌ ఇవ్వలేదు. ఒకవేళ వివరణ కోరిందేమో. నోటీసులు వచ్చాక సరైన విధంగా స్పందిస్తాం. విద్యార్థుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక పేరెంట్‌గానే ఆలోచిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తే ఈ ప్రభుత్వానికి ముఖ్యం. విద్యార్థులకు ఎలా మేలు జరిగితే అది చేస్తారు. ప్రజలు ఇప్పటికే మాకు 151 స్థానాలు ఇచ్చి, పరిపాలించమని మాకు దీవెనలు ఇచ్చారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 

- చివరిగా ఫ్యాక్షన్ హత్యలను ప్రభుత్వానికి, శాంతిభద్రతలకు ముడి పెట్టడం సరికాదు.