1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (08:27 IST)

ఏపీలో ఇక ఇసుక డోర్ డెలివరీ

రాష్ట్రంలో ఇసుకను ఎపిఎండిసి ద్వారా డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గనులశాఖామంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక డోర్ డెలివరీపై జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 155 శాండ్ స్టాక్ పాయింట్లు వుండగా, వాటిల్లో 13 పాయింట్లలో ఇసుక కొరత ఏర్పడుతోందని అన్నారు. ఈ పదమూడు చోట్ల ఆన్ లైన్ లో కొద్ది నిమిషాల్లోనే ఇసుక బుకింగ్ లు జరిగిపోతున్నాయని పేర్కొన్నారు. టెన్నాలజీని ఉపయోగించుకుని కొందరు మాత్రమే ఇసుకను బుక్ చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో వినియోగదారులకే నేరుగా ఇసుకను అందించాలనే లక్ష్యంతో ఇసుక డోర్ డెలివరీని అమలు చేయబోతున్నామని తెలిపారు.

ట్రాన్స్ పోర్ట్ చార్జీలతో కలిపి వినియోగదారుడి నుంచి ఇసుక రేటును ఎపిఎండిసి వసూలు చేస్తుందని అన్నారు. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ కోసం అధికధరలు చెల్లించాల్సిన అవసరం వుండదని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 255 ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను వెలికితీస్తున్నామని అన్నారు. రోజువారీ సగటు వినియోగం 80వేల టన్నులు వుందని అన్నారు. ప్రస్తుతం అదనంగా స్టాక్ పాయింట్లలో 9.63 లక్షల టన్నుల ఇసుక స్టాక్ వుందని వెల్లడించారు.  
 
జనవరి 2 నుంచి కృష్ణాజిల్లాలో ఇసుక డోర్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం...
కృష్ణాజిల్లాలో జవనరి 2వ తేదీన ఇసుక డోర్ డెలివరీని పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏడో తేదీన ఉభయగోదావరిజిల్లాలు, కడప జిల్లాలో ప్రారంభిస్తామని అన్నారు. అలాగే రోజుకో జిల్లా చొప్పున జనవరి 20వ తేదీ నాటికి మొత్తం అన్ని జిల్లాలోనూ ఇసుక డోర్ డెలివరీని అమలు చేస్తామని తెలిపారు.

 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభించిన ఇసుక పాలసీ ద్వారా ఇప్పటి వరకు 43,70,000 టన్నులు వినియోగదారులకు అందించామని తెలిపారు. రానున్న వర్షాకాలంలోనూ భవన నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా నెలకు 15 లక్షల టన్నుల చొప్పున మొత్తం 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్ లలో అందుబాటులో వుంచబోతున్నట్లు వెల్లడించారు. ఇసుకను అక్రమ ఆదాయంగా భావించిన ఆనాటి చంద్రబాబు సర్కార్ విధానాలకు భిన్నంగా పూర్తి పారదర్శకతతో ఇసుకను ప్రభుత్వం ఎపిఎండిసి ద్వారా విక్రయిస్తోందని తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలకు ఎన్జిటి ఏకంగా వందకోట్ల రూపాయల జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్ ఈ ఇసుక పాలసీకి రూపకల్ప చేశారని, కేంద్రప్రభుత్వం నుంచి అధికారులను కూడా తీసుకువచ్చి ఇక్కడి ఇసుక పాలసీని వారికి కూడా వివరించబోతున్నామని తెలిపారు.

ప్రభుత్వ నూతన ఇసుక పాలసీకి ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 389 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తున్నామని, జనవరి 9వ తేదీ లోగా ఈ చెక్ పోస్ట్ లు పూర్తవుతాయని అన్నారు. వీటిని ఎపిఎండిసి, సీఎం క్యాంప్ కార్యాలయాల్లోని కమాండ్ కంట్రోల్ రూంలకు కనెక్ట్ చేస్తామని తెలిపారు. 
 
అమరావతి ప్రాంత రైతులకు సీఎం న్యాయం చేస్తారు: మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి ప్రాంతంలోని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తప్పకుండా న్యాయం చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రాంత రైతులను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పక్షపాతిగా వున్న వైఎస్ జగన్ ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనివ్వరని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అభిప్రాయపడ్డారు.

గతంలో హైదరాబాద్ లోనే అభివృద్థిని కేంద్రీకరించడం వల్ల రాష్ట్రం విడిపోయి మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరూ గ్రహించాలని సూచించారు. అందుకే అటు విశాఖ, ఇటు అమరావతి, మరోవైపు కర్నూలు ప్రాంతాల్లో రాజధాని అభివృద్ది కనిపించాలని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. బోస్టన్ నివేదిక, హైపవర్ కమిటీ నివేదికలు వచ్చిన తరువాతే దీనిపై ప్రభుత్వం అన్నింటినీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఒక ప్రాంతం కోసమే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నాడని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఏడు వేల ఎకరాలు బినామీల పేరుతో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు మా వద్ద లెక్కలు వున్నాయని అన్నారు. ఈ భూముల కోసమే చంద్రబాబు, ఆయన అనుయాయులు రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లపాటు హైదరాబాద్ లో రాజధానిని కొనసాగించే అవకాశం వుందని, మరో అయిదేళ్లు అడిగినా పొడిగించే వారని అన్నారు. ఈ సమయంలో రాజధానిని పూర్తిస్థాయిలో నిర్మించుకునే అవకాశం వుండేదని అన్నారు.

దీనిని పూర్తిగా పక్కకు పెట్టి, చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించాలంటే దాదాపు రూ.1.06 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు ప్రభుత్వమే లెక్కలు వేసిందని, కానీ ఆయన పెట్టిన ఖర్చు ఎంతో అందరికీ తెలిసిందేనని అన్నారు. తాజాగా మూడు రాజధానుల ఆలోచనల వల్ల అమరావతికి ఎక్కడా నష్టం జరగదని అన్నారు.

చంద్రబాబు బోస్టన్ కంపెనీ నివేదికలపై విమర్శలు చేస్తున్నారని, మరి ఆయన హయాంలో అదే బోస్టన్ తో ఏ రకంగా నివేదికలు తెప్పించుకున్నారని ప్రశ్నించారు. ఆనాడు బోస్టన్ సంస్థకు వున్న విశ్వసనీతయ, ఇప్పుడు ఎలా పోయిందని ప్రశ్నించారు. 
 
పత్రికాస్వేచ్చపై చంద్రబాబు ద్వంద వైఖరి
తప్పుడు వార్తలు రాస్తే... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీఓ జారీ చేస్తే... చంద్రబాబు గగ్గోలు పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పత్రికా స్వేచ్చ దెబ్బతింటోందని రాద్దాంతం చేశారని అన్నారు. మరి ఇప్పుడు ఓ మహిళా జర్నలిస్ట్ పై దాడి జరిగితే... దానిని ఖండించకుండా...దాడి చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా వుందని అన్నారు.

ఇదేనా చంద్రబాబుకు ప్రతికాస్వేచ్చపై వున్న గౌరవం అని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిలో ఆమె ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు పెడితే పోలీసులపై కూడా విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.