ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (12:10 IST)

సంక్రాంతికి 1,266 ప్రత్యేక బస్సులు... బాబోయ్! 50శాతం అదనపు ఛార్జీలు

సంక్రాంతి వ‌చ్చేస్తోంది. పండుగ‌కు ఇంటికి వ‌చ్చే అల్లుడు, చుట్టాల కోసం అపుడే బ‌స్సుల హ‌డావుడి మొద‌ల‌యింది. సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1,266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 
 
 
హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు. 
 
ఈ సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు కోరారు.