ఆమె అనుమతి లేనిదే గ్రామంలోకి నో ఎంట్రీ?

village sarpanch
ఠాగూర్| Last Updated: గురువారం, 26 మార్చి 2020 (11:33 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, దేశ వ్యాప్తంగా వచ్చే నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీన్ని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం పకడ్బంధీగా అమలు చేస్తోంది. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగి తమ గ్రామంలో ఇతరులు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఓ గ్రామసర్పంచ్ ఒక్కరే రంగంలోకి దిగి ప్రజలెవరిని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. కేవలం పగటి పూటే కాకుండా, రాత్రిపూట ఆమె ధైర్యంగా, ఒంటరిగా నిలబడి కాపలా కాస్తున్నారు. ఆమె సేవలకు గ్రామ ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భీమునిగూడెం గ్రామ సర్పంచ్‌గా మడకం పోతమ్మ కొనసాగుతున్నారు. ఈమె తన గ్రామానికి తానే రక్షణగా ఉంటున్నారు. పోతమ్మ ఓ చేతిలో కర్ర పట్టుకొని గ్రామంలోకి ఎవరు రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు పోకుండా కాపాడుతున్నారు.

గ్రామస్తులైనా సరే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే కూరగాయల కోసం వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. 9 గంటలు దాటాక ఎవరు రావడానికి వీలు లేదని హెచ్చరికలు జారీచేస్తున్నారు. మడకం పోతమ్మ ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తూ దేశంలోని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కర్తవ్యానికి గ్రామప్రజలంతా మగ్ధులైపోతున్నారు.దీనిపై మరింత చదవండి :