మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:15 IST)

ఎస్సీల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం; సుశాంత్ కుమార్

ఎస్సీల అభివృద్ధికి తోడ్పడేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని భాజపా ఎస్సీమోర్చా జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర ఇన్ఛార్జి సుశాంత్ కుమార్ మాలిక్ పేర్కొన్నారు. భాజపా ఎస్సీ సెల్ సమావేశం భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సుశాంత్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం 70 ఏళ్లలో ఏ పార్టీ కూడా ఎస్సీల ఉన్నతికి కృషి చేయలేదని, భాజపా మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
 
 జన్ ధన్, ముద్ర, ఉజ్వల్, స్టాండప్, పిఎంఆవాస్ యోజన, వంటి పథకాల్లో ఎక్కువగా లబ్దిపొందేవారు ఎస్సీలే అన్నారు. దళితుడిని దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత భాజపాదే అన్నారు. అంబేద్కర్ జీవిత చిరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలను పంచక్షేత్రాలుగా అభివృద్ధి చేసి ఆయనకు గౌరవం కల్పించిన పార్టీ భాజపాగా పేర్కొన్నారు. మోర్చాలు పటిష్టం కావాలంటే ప్రతి పథకం ఎస్సీలకు చేరేలా కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు. ఉ త్తరప్రదేశ్లో భాజపా గెలిచిందంటే అధికశాతం ఎస్సీలు భాజపా వైపు మొగ్గుచూపిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే అక్కడ అధికారంలోకి రాగలిగినట్లు చెప్పారు. 
 
ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేకవిధానాలు అనుసరిస్తోందని, దళితులకు ఉద్దేశించిన విద్య, ఉపాధికి అందించే ఆర్ధికసహాయం నిలిపివేసి వెనుకబాటుతనానికి గురిచేస్తోందన్నారు. ఈ వైఖరిపై మోర్చా అలుపెరగని పోరాటం చేస్తోందని, రాబోయే రోజుల్లో మరింత పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. 
 
ఎస్సీమోర్చా జాతీయ కార్యవర్గసభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తెచ్చేందుకు మోర్చా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్సీమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబీ చక్రవర్తి, నాయకులు ఎలిశల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.