గుంటూరులో బోల్తా పడిన కృష్ణవేణి స్కూల్ బస్సు.. చిన్నారుల పరిస్థితి ఏంటి?
గుంటూరులో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. 50 మంది విద్యార్థులతో కూడిన ఈ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో వారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. మరో 25మంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని మాచర్ల నుంచి 50 మంది విద్యార్థులతో కూడిన స్కూల్ బస్సు మండాడి వాగు వద్ద ఎదురుగా వేరే వాహనం రావడంతో కంగారుపడి స్కూల్ బస్సు డ్రైవర్ దాన్ని తప్పించేందుకు స్టీరింగ్ బలంగా పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు నుంచి వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడిందని పోలీస్ అధికారి శ్రీనివాస రావు తెలిపారు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు సంబంధించి బస్సే ఈ ప్రమాదానికి గురైందని.. బస్సు లోయలో పడగానే స్థానికులు విద్యార్థులను రక్షించారు. అంతలో సహాయక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. బస్సును నడిపే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి వున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.