పిల్లలకు స్వతంత్రంగా మెలగడం నేర్పాలంటే..?
తల్లిదండ్రులు వారి పిల్లలచే మంచి స్నేహితుల్లా ఉండాలి. అప్పుడే మీరు.. వారి కోరికలను తెలుసుకోగలుగుతారు. అలానే వారి మనసును అర్థం చేసుకోగలరు. ఎందుకంటే.. కొందరి తల్లిదండ్రులు చీటికిమాటికి పిల్లలను కోపంగా, విసుగుగా చూస్తుంటారు. తల్లిదండ్రులే పిల్లల్ని అలా చూస్తే.. ఇక బయటవాళ్లు ఎలా చూస్తారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే.. ఇకపై ఇలా చేయాలనిపించదు. ఇలాంటి వారు ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మీ పిల్లల మనసును, వారి కోరికలను తెలుసుకోవచ్చును. మరి అవేంటో చూద్దాం..
1. పిల్లలలో సృజనాత్మకత పెరగాలన్నా, మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలన్నా తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంటుంది. మంచి పనులకు ప్రోత్సాహం ఇస్తూ, తెలియని వాటిని స్నేహితుల్లా మృదువుగా తెలియజేయాలి.
2. మీ పిల్లలు చేసే పనుల పట్ల ఆసక్తిని చూపాలి. ఏ పనైనా చకచకా చేస్తున్న వారిని అంత కంగారెందుకు.. అని మందలించుట, నెమ్మదిగా ఉన్నవారిని మరీ ఇంత నత్తనడకా.. లాంటి కామెంట్లతో మార్చాలని ప్రయత్నించడం సరికాదు.
3. పిల్లలు ఏదైనా కొత్త పని చేస్తుంటే దాని ఫలితం గురించి చెప్పి భయపెట్టడం సరికాదు.
4. పిల్లలకి మీ ఆలోచనలు, సూచనలు తెలియజెప్పాలి. వివిధ సమస్యల్ని పిల్లలతో చర్చించటమూ మంచిదే.
5. మీరు కోరుకున్నట్లు పిల్లలు ఏవేవో సాధించాలని వారి మీద ఒత్తిడి చేయకూడదు. అన్నింటి గురించి బోధిస్తూ పిల్లల్లోని సరదాని అణచి వేయకూడదు.
6. పిల్లలు తమాషా పనులు ఏమైనా చేస్తుంటే చులకనగా మాట్లాడకూడదు. దాని వలన వారిలో పెరగాల్సిన సెన్సాఫ్ హ్యుమర్ దెబ్బ తింటుంది.