1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మార్చి 2024 (10:54 IST)

సికింద్రాబాద్ - వైజాగ్‌ల మధ్య మరో వందే భారత్ రైలు

vande bharat express
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - వైజాగ్‌ల మధ్య మరో వందే భారత్ రైలును నడుపనున్నారు. ఈ రైలు కూడా సికింద్రాబాద్ - వైజాగ్‌ల మధ్య నడుపనున్నారు. ఈ రైలును రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5 గంటలకు, వైజాగ్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మరో వందే భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. అయితే, ఈ వందే భారత్ రైలు విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 
 
ఈ కొత్త రైలు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా ఈ రైలును నడపనున్నారు.
 
ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ గతేడాది జనవరి 15న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉండటంతో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. చాలా సందర్భాల్లో రిజర్వేషన్ దొరక్కపోవడంతో పాటూ రానుపోను ఒకే రైలు ఉండటంతో తరచూ సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా అధికారులు రెండో వందేభారతన్ను అందుబాటులోకి తేనున్నారు.
 
ఇక విశాఖపట్నం - సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్‌లో 16 బోగీలు ఉండగా, సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్లో మాత్రం 8 బోగీలే ఉన్నాయి. రైళ్లను ఎక్కువ స్టేషన్లలో ఆగేందుకు వీలుగా రైల్వే బోర్డు బోగీల సంఖ్యను పరిమితం చేస్తోంది.