సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (17:23 IST)

వరల్డ్ ఉమెన్స్ డే.. మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ

gas cylinder boy
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని నారీమణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్లపై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803కి చేరనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తగ్గించిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి.
 
'ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా 'నారీశక్తి'కి ప్రయోజనం చేకూరుతుంది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, గత ఆరు నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండరుపై కేంద్రం రూ.200 కుదించింది. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగొచ్చింది. తాజాగా మరో రూ.100 తగ్గించటంతో అది రూ.803కు చేరింది.
 
మరోవైపు, ఢిల్లీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రూ.300 రాయితీ పొందుతున్న వారికి సిలిండర్ రూ.503తే లభించనుంది. మిగతావారు దీన్ని రూ.803కు పొందొచ్చు అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. మరోవైపు ప్రధాని అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్.. ఉజ్వల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. 2023 అక్టోబరు నెలలోనే ప్రభుత్వం ఈ సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. 
 
కాగా, ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గతకొన్నేళ్లలో గణనీయంగా పెరిగిన గ్యాస్ ధరలు ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా మారనున్నాయి. 2021 జులై నుంచి 2023 ఆగస్టు మధ్య 14.2 కిలోల సిలిండర్ ధర రూ.204 పెరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార పార్టీపై విమర్శలకు దీన్ని అస్త్రంగా మార్చుకుంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంట గ్యాస్ సిలిండర్‌ను కొంతమేరకు తగ్గించింది.