బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (14:21 IST)

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్... రాష్ట్రపతి సిఫారసు

sudha murthy
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఆమెను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుక్రవారం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే గౌరవార్థం సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషిఅపారం. స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్ కావడం నారీశక్తికి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి" అని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
కాగా, 73 యేళ్ల సుధామూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి. మూర్తి ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఆమె సుపరిచితమే. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో వృత్తి జీవితానని ప్రారంభించిన ఆమె.. పలు అనాథశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.