కరోనా కోసం కాపలా వుంటే.. బల్లి అంత పనిచేసింది..?
కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు ఓ బల్లి ముచ్చెమటలు పట్టించింది. అర్ధరాత్రి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీసులను అర్ధరాత్రి ఓ బల్లి హడలెత్తించింది. చిలకలగూడలోని ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో అర్ధరాత్రి ఎమర్జెన్సీ సైరన్ మోగింది. దీంతో ఉలిక్కి పడ్డ స్థానికులు ఏటిఎంలో దొంగలు పడ్డారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఏటీఎంను తెరిచి చూడగా... అందులో డబ్బులు చోరీకి గురికాలేదు. ఇంకా అక్కడంతా మామూలుగానే ఉంది. కానీ, సైరన్ ఎలా మోగిందనే చూసిన పోలీసులు, స్థానికులు ఖంగుతిన్నారు. ఏటీఏంలోపల ఉన్న సైరన్ పైకి బల్లి వెళ్లటంతో అలారమ్ మోగినట్లుగా గుర్తించి అందరూ అవాక్కయ్యారు. లాక్‌డౌన్ సమయంలో బల్లి చేసిన పనికి కాసేపటికి అంతా నవ్వుకున్నారు.