శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (09:22 IST)

నన్నయ వర్సిటీలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు

విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో తన ప్లాట్‌కు పిలిపించి ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

నన్నయ వర్సిటీలో ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఈ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో తమను తన ఫ్లాట్‌కు పిలిపించి.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
 
విద్యార్థినుల కన్నీటి లేఖ
చాలా రోజులుగా ఈ ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న అఘాయిత్యాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము రాస్తున్న ఉత్తరం మా మానసిక మనో వేదనను ప్రతిబింబిస్తుంది.ఎన్నో ఆశలతో, మా తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకంతో నన్నయ యూనివర్సిటీలో ఉన్నత చదువులను పూర్తి చేయాలని అడుగుపెట్టాం.

మా అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని మా జీవితాలతో ఇంగ్లిష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఆడుకుంటున్నాడు. వైస్‌ చాన్సలర్‌ పి.సురేష్‌వర్మ చాలా చాలా క్లోజ్‌ అని ఆయన చెప్పుకుంటున్నారు. అందువల్ల  మాకు న్యాయం జరగదు. సూర్యరాఘవేంద్ర, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పి.సురేష్‌వర్మపై ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేదు. 

రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సాధించిన మీరు మా అన్నగా… తండ్రిగా ఆలోచించి మా జీవితాలను నాశనం చేస్తున్న ఒక శాడిస్ట్‌ ప్రొఫెసర్‌ను వర్సిటీ నుంచి డిస్మిస్‌ చేయాలని కోరుతున్నాం. చాలా మంది ఆడపిల్లలు మీ ముందుకు వచ్చి చెప్పుకోలేకపోవడానికి అనేక కారణాలున్నాయి.

ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే ఎక్కడ చదువును అర్ధాంతరంగా ఆపేస్తారోనని భయం. మొత్తం మా బాధను వైస్‌ చాన్సలర్‌కు చెప్పినప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే మీ దృష్టికి మా బాధను తీసుకువస్తున్నాం. మేము విద్యార్థినులం. మా కన్నీళ్లు యూనివర్సిటీకి మంచిది కాదు.

అందరూ విద్యార్థినులూ మాలా ముందుకు ధైర్యంగా రాలేరు. మాలాంటి అమాయకపు విద్యార్థినుల జీవితాలను కాపాడాలని ఈ ఉత్తరం ద్వారా విన్నవిస్తున్నాం.