శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (16:50 IST)

లోకేష్ వ్యవహరించిన తీరుతో సిగ్గేస్తోంది: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

శాసన మండలిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. బుధవారం నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్‌ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు.

ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు.

టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధేస్తోందని పేర్కొన్నారు. 

తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్‌.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని అన్నారు.