పల్నాడు ఎందుకు ఫేమస్ అయిందంటే బ్యాడ్ రీజన్స్ ... ఎస్పీ మల్లికా గార్గ్!! (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఆధిపత్య పోరు, ఫ్యాక్షనిజం, కులాలు కుంపట్ల ఘర్షణలలో రగిలిపోవడమే. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా, ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పల్నాడులో చోటు చేసుకున్న అనేక సంఘటనలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీగా కొత్తగా నియమితులైన మల్లికా గార్గ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పల్నాడు ఇండియాలో ఫేమస్ అయ్యింది.. ఎందు అంటే బ్యాడ్ రీజన్ వల్ల అంటూ చెప్పుకొచ్చారు.
జిల్లాలోని వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పల్నాడు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందన్నారు. చెడు సంఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమన్నారు. పల్నాడు జిల్లా ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని ఫ్రెండ్స్ అడుగుతున్నారని ఆమె చెప్పారు. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా మార్మోగిపోతుందన్నారు.
కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకుని తిరగడం దాడులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్టు చేశామన్నారు. నరసరావుపటే జైలు ఖాళీ లేక రాజమండ్రికి పంపుతున్నామన్నారు.
ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు రోడ్లపై ఎవరు తిరగొద్దని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను ఉల్లింఘించిన వారిపై కేసులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేసమయంలో శాంతిభద్రత పరిరక్షణలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.