ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార సునామీ : 75 రోజులు... 180 ఎన్నికల ప్రచార ర్యాలీలు

narendra modi
సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ విజయపథంలో నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగించారు. ఇందులో కోసం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఒక్క రోజులో మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి రెండన్నర నెలల్లో ప్రధాని దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు. 
 
ఈ యేడాది మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అప్పటి నుంచి బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. ఈ 75 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. మూడు పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదేసి సభలు నిర్వహించారు. ఈ మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. ఆ తర్వాత బీహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్‌లో 18 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి మోడీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టారు.
 
ఈ ఎన్నికల్లో దక్షిణాదిలో బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడి ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.
 
ఇకపోతే, తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోడీ ఐదు ర్యాలీలు చేపట్టారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రంపైనా బీజేపీ దృష్టిపెట్టింది. అక్కడ మోడీ ఏకంగా 10 ప్రచారాలు నిర్వహించారు. పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. 
 
అటు మధ్యప్రదేశ్‌లో 10, జార్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, హర్యానాలో మూడు ర్యాలీలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్‌లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు. ఇవేగాక, పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. ఈ ఎన్నికల సీజన్‌లో మోడీ తన చివరి ప్రచారాన్ని గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో నిర్వహించనున్నారు. అది పూర్తి చేసుకుని ఈ సాయంత్రం కన్యాకుమారిలో ధ్యానానికి వెళ్లనున్నారు.