శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (10:58 IST)

16మంది జర్నలిస్టులకు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు

కరోనా మహమ్మారి ప్రస్తుతం జర్నలిస్టులను పట్టుకుంది. ఇప్పటికే 16మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో సకాలంలో వైద్యసేవలు అందక జర్నలిస్టు మనోజ్‌ మృతి చెందడం, జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. సచివాలయ బీట్‌ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్‌ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్‌ మనోజ్‌ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.