మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జులై 2019 (14:04 IST)

జగన్ బ్రదర్‌కు తప్పిన ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో చెట్టుకొనను తగలడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఆయనతో పాటు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి 7.30 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం... గంట ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత ఈ విమానం 8.50 నిమిషాలకు బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన 10 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ను పైలట్లు కోరారు. 
 
ఏటీసీ అనుమతితో ఆ విమానం అత్యంవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఏర్పడిన సాంకేతక లోపం ఈ పరిస్థితి తలెత్తింది. విమానంలో కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డితో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపైనే నిలబడిపోయింది. స్పైస్ జెట్ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో ఈ విమానాన్ని పాత టెర్మినల్ బిల్డింగ్ వద్దకు తీసుకొచ్చారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు, టెక్నీషియన్లు సరిచేస్తున్నారు.