మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (23:00 IST)

'వాసిరెడ్డి పద్మ'ను కలిసిన ఎస్ఎస్సీ బోర్డు మహిళా ఉద్యోగినులు

మహిళల రక్షణ, భద్రత అంశాలతో పాటు ఇతర సమస్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు మహిళా ఉద్యోగినులు అన్నారు. వారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను సోమవారం ఆమె అధికారిక నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఎస్ఎస్ఈ బోర్డు డైరెక్టర్ సుబ్బారెడ్డి లైంగిక వేధింపులపై తామిచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించిన తీరు హర్షణీయమన్నారు. ఏపీ ఎస్ఎస్సీ బోర్డులో మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేశారని.. దీనిపై విచారణ నివేదికతో అడిషనల్ డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే.

పాఠశాల విద్యాశాఖలో సుబ్బారెడ్డి మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్గ్ గా... ప్రభుత్వ పరీక్షల సంచాలకులుగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులను సుబ్బారెడ్డి వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.

అంతే కాకుండా కార్యాలయం వద్ద వారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారని, నచ్చని సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ఉద్యోగిపై చేయి చేసుకున్నారని, మహిళా ఉద్యోగినులను అదన పు సమయం పని చేయాలని వేధించారని ఆరోపణలు వచ్చాయి.

దాదాపు 20 రోజులకుపైగా నిరసనలు చేపట్టడంతో పాటు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు సుబ్బారెడ్డిని బదిలీ చేయాలని వినతులు అందజేశారు. అయితే, అటు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదిచ్చినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో చివరి ప్రయత్నంగా బాధితులు ఏపీ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు.

కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సత్వరమే స్పందించి విచారణకు కమిటీ వేశారు. అనంతరం కమిటీ నివేదిక సమర్పించిన పదిరోజుల్లోనే సుబ్బారెడ్డిపై బదిలీ వేటేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏడీ సుబ్బారెడ్డిని ఇన్చార్జ్ విధుల నుంచి తొలగించడంపై మహిళా ఏపీ ఎన్జీవో సంఘాలు హర్షం వెలిబుచ్చగా.. ఎస్ఎస్సీ బోర్డు మహిళా ఉద్యోగినులు నేరుగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి దుశ్శాలువాతో ఆమెను సన్మానించారు. మూడేళ్లుగా తాము సదరు ఉన్నతాధికారి వికృత పవర్తన పట్ల అనుభవిస్తున్న నరకానికి మహిళా కమిషన్ విముక్తి పలికిందని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మహిళా ఉద్యోగినులతో మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత విషయంలో ప్రభుత్వకృషికి తగ్గట్టుగానే మహిళా కమిషన్ చురుకైన పాత్ర పోషించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

పని ప్రదేశాల్లో మహిళలు పట్ల దురుసుగా వ్యవహరించడం...లైంగిక ప్రవర్తన, ఇతర వేధింపులను మహిళా కమిషన్ సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. తమ దృష్టికొచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఎంతటి ఉన్నతస్థాయి అధికారైనప్పటికీ విచారించి చర్యలకు ఆదేశిస్తామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.