సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:46 IST)

హత్య చేయడానికి వచ్చి హోటల్ సిబ్బందిపై అత్యాచారం.. ఎక్కడ?

ఓ వ్యాపారవేత్తను హత్య చేయడానికి వచ్చిన కిరాయి హంతకులు మహిళా సిబ్బందిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత సెక్స్ వర్కర్లను సరఫరా చేయాలని కోరారు. అందుకు హోటల్ మేనేజరు నిరాకరించడంతో ఆ హోటల్‌లో పని చేసే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శుక్రవారం కొంతమంది నిందితులు ఓ హోటల్‌లో దిగారు. కొంతసేపటి తర్వాత సెక్స్ వర్కర్లను ఏర్పాటు చేయాలని హోటల్ మేనేజర్‌ను కోరారు. 
 
ఆ తర్వాత కాసేపటికే మహిళా ఉద్యోగులు నిద్రిస్తున్న గదిలోకి బలవంతంగా చొరబడి ఇద్దరు మహిళలను తుపాకితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా ముగ్గురు నిందితులు వారికి కాపలాగా ఉన్నారు. 
 
అయితే, వారి తీరును అనుమానించిన మేనేజర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ హోటల్‌లో దిగిన వారి వద్ద  మారణాయుధాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. 
 
ఈ విషయం తెలిసి అప్రమత్తమైన భివాడి ఎస్పీ రామ్మూర్తి జోషి పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి హోటల్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మహిళలను రక్షించారు. ఆ తర్వాత వారిపై అత్యాచారం జరిపిన నిందితులను నరేశ్ గుజ్జర్, లోకేశ్, రాహుల్, దన్వీర్, ప్రిన్స్ తివారీలను అరెస్టు చేశారు. 
 
వీరివద్ద జరిపిన విచారణలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. హౌసింగ్ సొసైటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న నరేశ్ జాట్ నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన నిందితులు.. ఆయన కనుక ఆ మొత్తాన్ని ఇవ్వకుంటే హత్య చేయాలని పథకం పన్నినట్టు వెల్లడించారు. 
 
కాగా, నిందితుల్లోని నరేశ్ గుజ్జర్‌పై ఇప్పటికే ఓ హత్య కేసు నమోదై ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.