గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:10 IST)

'ఈ-నారి'తో సైబర్ మోసాలకు చెక్: వాసిరెడ్డి పద్మ

సమాజంలో జరుగుతున్న అనర్థాలను గమనిస్తూ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'డిజిటల్ లిటరసీ, ఆన్ లైన్ సేఫ్టీ ప్రోగ్రాం, డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళల ఆన్ లైన్ భద్రత ' అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా పలు యూనివర్శిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో విద్యార్ధినులకు 'ఈ-నారి' వెబినార్ సమావేశాలు కొనసాగుతోన్నాయి.

ఆగస్టు 27  నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈనెల 27తో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన కార్యాలయంలోని చాంబర్ నుంచి వెబినార్ లో పలు యూనివర్శిటీ విద్యార్ధినులతో మాట్లాడారు.* మహిళా సాధికారిత- పథకాలు-ఫలితాలు అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఈ-నారీ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చేపట్టిందన్నారు.

స్త్రీలు, విద్యార్థినులపై 95 శాతం అఘాయిత్యాలు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారే చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థినులు వాడే మొబైల్ ఫోన్లపై తల్లిదండ్రులకు నియంత్రణ లేకుండా పోతోందని, దీనివల్ల వారు ఎలాంటి వారితో పరిచయాలు పెంచుకుంటున్నారో తెలియకుండా పోతోందన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికి ఈ-నారి కార్యక్రమం దోహదపడుతుందన్నారు.దిశ యాప్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. 

లాక్ డౌన్ కాలంలో మహిళలపై సైబర్ నేరాలు అధికంగా జరిగాయని, సోషల్ మీడియా నేరాలు, ఆన్లైన్ లైంగిక నేరాలు మరియు ఆర్థిక మోసాలపై ఆమె ఈ వెబినార్ లో చర్చించారు. ఫేస్బుక్ క్లోనింగ్ తో పాటు దాని నుండి ఖాతాను ఎలా రక్షించుకోవాలి, ఖాతా క్లోన్ చేయబడిందో లేదో ఎలా తనిఖీ చేయాలో ఆమె వివరించారు.

ఖాతా క్లోన్ చేయబడినా లేక, మహిళల ఫోటోలను వేరే ఎక్కడైనా ఉపయోగించినప్పుడు ఎలా తెలుసుకోవాలి అని వివరించారు. గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో, తమ ఫోటోను వేరే చోట ఉపయోగించారా అని తనిఖీ చేయవచ్చునన్నారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఇమెయిల్, సందేశాలు, డిస్కౌంట్లు, కూపన్ కోడ్లు మొదలైన వాటికి సంబంధించి మహిళలకు ఆమె కొన్ని భద్రతా చిట్కాలను కూడా ఇచ్చారు.

ప్రజలు కార్డు వివరాలను నమోదు చేసే చోట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తక్కువ బాలన్స్ లు ఉన్న కార్డులు ఇవ్వడం ఉత్తమమని తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో 'ఈ-నారి' వెబినార్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు గుంటూరులో ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కడపలోని యోగి వేమన యూనివర్శిటీ, పద్మావతి మహిళా యూనివర్శిటీ (తిరుపతి), కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీలలో వెబినార్ జరగ్గా... మిగిలిన వాటిల్లోనూ ఈనెల 27వ తేదీ వరకు సమావేశాలు జరుపుతామన్నారు. 

ప్రస్తుతం కొనసాగుతోన్న సమావేశాల్లో
ప్రతి విశ్వవిద్యాలయం నుంచి పది వేల మంది విద్యార్థినులు వెబినార్లలో పాల్గొంటున్నారని వివరించారు. భవిష్యత్తులో  జిల్లా కేంద్రాల్లో వివిధ రంగాల మేధావులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు జయలక్ష్మి, గజ్జెల లక్ష్మి, డైరెక్టర్‌ ఆర్‌. సూయజ్‌, కార్యదర్శి నిర్మల, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.