ఆన్‌లైన్‌లో రీఫండ్ త్వరగా చెల్లించేలా చర్యలు... టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
శ్రీవారి ఆర్జితసేవలు, గదులు, కల్యాణమండపాలు తదితరాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకున్న పక్షంలో త్వరితగతిన రీఫండ్ చెల్లించేలా అప్లికేషన్‌లో మార్పులు చేపట్టాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఐటి అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో గురువారం ఐటి విభాగంపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రీఫండ్‌కు సంబంధించిన ఫిర్యాదులను కాల్‌సెంటర్‌కు కూడా అనుసంధానం చేయాలని, తద్వారా సంబంధిత భక్తులకు సరైన సమాచారం ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు.
తిరుమలలో వసతి గదులు, లాకర్లను మరింత పారదర్శకంగా కేటాయించడంతోపాటు, లాకర్లు పొందే తేదీ, తిరిగి అప్పగించే తేదీల నమోదు, 2 రోజులకు మించి లాకర్లు వినియోగించేవారి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించాలన్నారు. శ్రీవారి సేవకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్‌లో రద్దీ ఉన్న రోజులు, లేని రోజుల్లో అవసరమైన సేవకుల సంఖ్యను ఆయా విభాగాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం, అందుకు అనుగుణంగా సేవకుల కేటాయింపునకు వీలుగా మార్పులు చేపట్టాలన్నారు.
శ్రీవాణి ట్రస్టు (ఆలయ నిర్మాణం)కు సంబంధించి దాతలకు కల్పించే ప్రయోజనాలపై విధి విధానాలు రూపొందించాలని ఈవో సూచించారు. తిరుమలలో గదుల బుకింగ్‌కు సంబంధించి 100 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో కాగిత రహిత బిల్లులు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.