శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (17:30 IST)

ఏపీ ఎన్జీవోలు స‌మ్మెకు సై... ప్రభుత్వానికి నోటీసు జారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ  అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు.

 
నోటీసు ఇచ్చేందుకు వీరంతా మొద‌టి బ్లాకుకు వెళ్ల‌గా, సీఎస్‌ సమీర్‌ శర్మ దిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో పేర్కొన్నారు. 
 
 
ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని, నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌ను ఉద్దేశిస్తూ సమ్మె నోటీసును ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ముఖ్యకార్యదర్శికి అందజేశారు.