ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (21:47 IST)

రెండేళ్ళలో 40 వేల మంది రిటైర్మెంట్... అందుకేనా 62కి పెంచింది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సు 62 ఏళ్ళ‌కు పెంచ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. రిటైర్మెంట్ వ‌య‌సును రెండేళ్ళు పెంచ‌డంపై కొంద‌రు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంటే, మ‌రికొంద‌రు దీన్ని విమ‌ర్శిస్తున్నారు. ఇది కేవ‌లం ఉద్యోగ వ‌ర్గాల‌ను మ‌భ్య‌పెట్టేందుకు మాత్ర‌మే అని పేర్కొంటున్నారు.
 
 
రిటైర్మెంట్ వ‌య‌సు పెంచ‌డంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద లాజిక్కే వేసిందంటున్నారు. వచ్చే రెండు ఏళ్లలో 40 వేల  మంది ఉద్యోగులు రిటైర్ అయ్యే అవకాశం ఉంద‌ట‌. ఒక్కో ఉద్యోగి రిటైర్ అయితే సరాసరిన 40 లక్షల రూపాయ‌లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెపుతున్నారు. ఇప్ప‌టికే రిటైర్ అయిన వారికి స‌రిగా బెనిఫిట్స్ అంద‌డం లేదనీ, దీనితో ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన ఉద్యోగులు ట్రెజ‌రీ చుట్టూ, ఫైనాన్స్ డిపార్మెంట్ చుట్టు చెప్పుల‌రిగేలా తిరుగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
 
 
వ‌చ్చే రెండేళ్ల‌లో రిటైర్ అయ్యే వారికి మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయ్యే ఖర్చు 16 వేల కోట్లు పైమాటేననీ, ఈ లెక్కన సరాసరి సంవత్సరానికి 8 వేల కోట్లు. ఇంత పెద్ద మొత్తం ఇవ్వలేక ఉద్యోగి సర్వీస్ వయస్సు 60 నుండి 62కి పెంచార‌నే విమ‌ర్శలు వ్య‌క్తం అవుతున్నాయి.
 
 
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పి.ఆర్.సి. గతంతో పోలిస్తే తిరోగమనంలో ఉందని ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐ.వి.) పేర్కొన్నారు. సాంకేతికంగా ఈ పి.ఆర్.సి. 1.7.2018 నుండి అమలైనా ఫిట్మెంట్ విషయంలో 23.29 అనేది ఉద్యోగులకు సంబంధించి తిరోగమనమే  అని పేర్కొన్నారు. గత 10వ పి.ఆర్.సి. 43 శాతం ఫిట్మెంట్ కేవలం 11 నెలల కాలం నోషనల్ సాధించడం చరిత్రలో ఒక మంచి పరిణామమన్నారు. 
 
 
ఈ పి. ఆర్. సి 18 నెలలు మాత్రమే నగదు రూపంలో ఉంటుంది. మిగిలిన కాలం ఏం చేస్తారో చూడాలన్నారు. గతంతో పోల్చినా, తెలంగాణతో పోల్చినా ఉద్యోగులకు తగిన న్యాయం జరగలేదన్నారు. రిటైర్మెంట్ కు సంబంధించి నాలుగవ తరగతి ఉద్యోగులకు 62 వయసు వరకు అవకాశం ఇవ్వాలని చాలా కాలంగా జెఎసి డిమాండ్‌గా ఉందన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన 62 వయసు ప్రకటనలో రిటైర్ అయ్యే వారికి ఇవ్వాల్సిన రాయితీలు వాయిదా వేయడానికే చేసినట్టుగా ఉందన్నారు.