ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో భారీ కొండ చిలువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కనిపించి కలకలం సృష్టించింది. ఈ ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థకు చెందిన బాలుర వసతి గృహంలో ఓ మంచం కింద పెద్ద కొండ చిలువ కనిపించడంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. దీన్ని చూసిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు అటవీశాఖ, అగ్నిమాపకదళ బృందానికి సమాచారం చేరవేసి, వారంతా కలిసి అక్కడికి చేరుకొని కొండచిలువను గోనె సంచిలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో అలిపిరి - తిరుమల నడక దారిలో అంటే మెట్ల మార్గంలో కూడా చిరుత పులుల సంచారం అధికమైన విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితం ఓ చిరుత పులి ఓ చిన్నారిపై దాడి చేసి చంపేసింది కూడా. ఆ తర్వాత మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలపై తితిదే అధికారులు ఆంక్షలు విధించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ తాజాగా కూడా ఓ చిరుత పులి కనిపించి కలకలం సృష్టించింది.
చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారు : హైకోర్టుకు వైద్యుల నివేదిక
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుండె సమస్యతో బాధపడుతున్నారని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుల బృందం నివేదికను తయారు చేసింది. చంద్రబాబుకు ఇటీవల కంటి ఆపరేషన్‌తో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా జరిగాయి. వీటి వివరాలతో కూడిన నివేదికను వైద్యులు ఇవ్వగా, దాన్ని ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు మెమో ద్వారా దాఖలు చేశారు.
"చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ చేశాం. అనారోగ్య సమస్య నుంచి కోలుకునేందుకు మేము సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగించాలి. కంటి పరీక్ష కోసం ఐదు వారాల షెడ్యూల్ ఇచ్చాం. ఆపరేషన్ చేసిన కంటికి ఐదు వారాలు ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ పరీక్షిస్తుండాలి. కంట్లో చుక్కల మందు వేసుకుంటుండాలి. చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో సమస్యలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలి" అని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.