టీచర్ కొట్టారంటూ టీచర్లపై ఫిర్యాదు : విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు!
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి చదువుతున్న బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. సహా విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి వారిని వేధిస్తున్న ఆరోపణలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఐదుగురు అమ్మాయిల ఖాతాలను హ్యాక్ చేసిన బాలుడు వారి వ్యక్తిగత ఫోటోలు మెసేజ్‌లను ఇతర క్లాసుల అబ్బాయిల మొబైల్స్‌కుపంపి కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్కూల్ టీచర్లు నాలుగు రోజుల క్రితం బాలుడుని మందలించి కొట్టారు. దీంతో బాలుడు తండ్రి అసలు విషయం దాచి టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విషయం తెలిసిన బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, బాలుడు వేధింపులపై విచారణ చేపట్టిన ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ, రూరల్ సీఐ బాలమద్దిలేటి వేధింపులు నిజమేనని తేల్చారు. దీంతో బాలుడుతో పాటు అతడికి అండగా ఉన్న తల్లిదండ్రులు మూలే కొండమ్మ, మాధవరెడ్డి, కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.