బుధవారం, 26 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మార్చి 2025 (14:30 IST)

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

jhansi lakshmi
పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చొని పరీక్ష రాస్తున్న తనను కొందరు వ్యక్తులు ప్రశ్నపత్రం చూపించాలని కోరారని, అందుకు తాను అంగీకరించకపోవడంతో రాళ్ళతో కొడతానంటూ బెదిరించడంతో ప్రశ్నపత్రం చూపించానని ప్రశ్నపత్రం లీకేజీ కేసులో డీబార్‌కు గురైన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి వాపోతుంది. ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తనకేపాపం తెలియదని చెప్పింది. 
 
నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో బల్లెం ఝాన్సీ లక్ష్మీ అనే విద్యార్థినిని విద్యాశాఖ అధికారులు డీబార్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కొందరు అకతాయిలు వచ్చి కిటికీ దగ్గర పరీక్ష రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నపత్రం ఫోటో తీసుకున్నారని చెప్పింది. ప్రశ్నపత్రం చూపించకుంటే రాయితో కొడతామంటూ బెదిరించారని, దీంతో తనకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక ప్రశ్నపత్రం చూపించినట్టు తెలిపింది.  
 
పైగా, తన పక్క కూర్చొన్న మిగిలిన విద్యార్థులు కూడా ఏమి కాదులే చూపించు అని అన్నారని, ఈ లీకేజీలో తన ప్రమేయం ఏమాత్రం లేదని అందువల్ల తన డీబార్‌ను రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎవరో చేసిన దానికి తనను బలిచేశారని, దయచేసి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరింది. పరీక్ష రాసేందుకు అనుమతివ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం మినహా తనకు మరోమార్గం కనిపించడం లేదంటూ బోరున విలపించింది.