శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (12:36 IST)

‘పెగాసస్‌’ హ్యాకింగ్ పై నిపుణుల కమిటీతో సుప్రీం విచార‌ణ‌

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. 
 
 
నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 
 
 
తాజాగా బుధవారం తీర్పును వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను తాము ఎన్నటికీ అనుమతించబోమని కోర్టు వెల్లడించింది. 
 
 
‘‘మనం సాంకేతిక శకంలో జీవిస్తున్నాం. అయితే టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యక్తలు గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమనే విషయాన్ని మనమంతా గుర్తించాలి. పెగాసస్‌ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం, ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాం. దీనిపై తీసుకున్న చర్యలేంటో, వారి స్పందన ఏంటో సవివరంగా చెప్పేందుకు కేంద్రానికి అనేక అవకాశాలిచ్చాం. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అసంపూర్ణ అఫిడవిట్‌ సమర్పించింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అన్నదానిపై కేంద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదు. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇక్కడ పిటిషనర్లు చేసిన ఆరోపణలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి. కేంద్రం కూడా దీనిపై కమిటీ ఏర్పాటునకు సుముఖంగానే ఉంది. అందువల్ల కమిటీని ఏర్పాటు చేయడం తప్పితే మరో అవకాశం కన్పించలేదు’’ అని ధర్మాసనం వివరించింది. 
 
 
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్, తృణమూల్‌ కాంగ్రెస్ అగ్రనేత, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపి కేంద్రం స్పందన కోరింది. అయితే దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయట్లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.