శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (07:33 IST)

3 కోట్ల రేషన్ కార్డులు రద్దా? సుప్రీంకోర్టు విస్మయం

దేశ వ్యాప్తంగా మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ రేషన్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో రద్దు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేస్తూ ఇది తీవ్రమైన అంశమని పేర్కొంటూ లోతైన విచారణ జరిపిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రాముబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
అలాగే, కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ స్పందనను నాలుగు వారాల్లోగా తెలియజేయాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. జార్ఖండ్‌కు చెందిన కొయిలీదేవీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. 
 
తమ కుమార్తె సంతోషి(11) ఆకలితో అలమటించి 2018 సెప్టెంబరు 28న ప్రాణాలు కోల్పోయిందని కొయిలీదేవి పిల్‌లో పేర్కొన్నారు. ఆధార్‌తో  రేషన్‌కార్డును అనుసంధానం చేయని కారణంగా అధికారులు 2017 నుంచి రేషన్‌ నిలిపివేశారని సంతోషి కుటుంబసభ్యులు ఆరోపించారు. 
 
తమది పేద కుటుంబమని, రేషన్‌ కూడా లేకపోవడంతో తినడానికి తిండి కరువైందని, దీంతో తమ కుమార్తె చనిపోయిందని కొయిలీదేవి వాపోయింది. దీనిపై ఆమె తన సోదరి గుడియాదేవితో కలిసి 2018లో సుప్రీంను ఆశ్రయించారు.
 
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కేంద్రం స్పందన కోరగా.. ఆధార్‌ లింక్‌ కాని కారణంగా ఎవరికీ రేషన్‌ను నిలిపివేయలేదని అప్పట్లో బదులిచ్చింది. అయితే ఆధార్‌తో అనుసంధానం కాని కారణంగా కేంద్రం దాదాపు మూడు కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేసిందని, దీంతో ఆకలిచావులు నెలకొన్నాయని పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గొంసాల్వెస్‌ బెంచ్‌ దృష్టికి తీసుకొచ్చారు. 
 
ఈ వాదనను అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖీ తోసిపుచ్చారు. రేషన్‌కార్డులు రద్దు చేశారన్నది అవాస్తవమని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెంచ్‌ పై విధంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ వ్యాజ్యంపై తుది విచారణ చేపడతామని పేర్కొంది.