గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 3 జులై 2021 (16:31 IST)

భార్యపై అనుమానం, అతిక్రూరంగా చంపాడు: తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ

ఎట్టకేలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్యను అతి క్రూరంగా చంపిన భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతిలో మీడియా ముందు ఉంచారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు. కోపంతో రగిలిపోయిన భర్త మద్యం మత్తులో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేసులో వేసి కాల్చేశాడని ఎస్పీ తెలిపారు.
 
అసలేం జరిగిందో ఎస్పీ మాటల్లోనే... ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు శ్రీకాంత్ రెడ్డి, భువనేశ్వరి. భువనేశ్వరి స్వస్థలం చిత్తూరు జిల్లా రామసముద్రం, శ్రీకాంత్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా చిట్వేలు. ఇద్దరికీ బెంగుళూరులో  పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
ఇద్దరూ వేర్వేరు కులాలైనా పెద్దలు అంగీకరించారు. వీరికి వివాహం జరిగింది. మూడేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి జులాయిలా పని పాటా లేకుండా శ్రీకాంత్ రెడ్డి తిరిగేవారు. సమాజ సేవ అంటూ కార్యక్రమాలు చేశాడు. ఎంతోమందితో పరిచయాలున్న శ్రీకాంత్ రెడ్డి అప్పులు కూడా చేశాడు.
 
తెలిసిన వారిదగ్గర అప్పులు చేశాడు. తన కూతురుకు బాగా లేదంటూ తన అకౌంట్‌లో డబ్బులు వేయించుకుని జల్సాలు చేసేవాడు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ రెడ్డి ప్రతి రోజూ తాగేవాడు. భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న వీరిద్దరు కరోనా కారణంగా తిరుపతికి వచ్చారు.
 
తిరుపతిలోని కొర్లగుంట సమీపంలో ఒక అపార్టుమెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల నుంచి ఇక్కడే ఉన్నారు. భార్య ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తూ ఉండేది. అయితే మద్యానికి బానిసై రోజూ ఖాళీగా తిరిగే శ్రీకాంత్ రెడ్డి భార్యను వేధించాడు. తనతో పాటు పనిచేసే మరో సాఫ్ట్వేర్ ఉద్యోగితో భువనేశ్వరి చనువుగా ఉందని అనుమానించాడు.
 
ఆ అనుమానమే పెనుభూతంగా మారింది. 10 రోజుల క్రితం భార్యను చంపి సూట్‌కేసులో కుక్కాడు. అంతటితో ఆగలేదు. బంధువులందరికీ తన భార్య డెల్టా వేరియంట్ కరోనాతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతురాలి బంధువు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
అయితే అప్పటికే తిరుపతిలోని రుయా ఆసుపత్రి వెనుకాల ఒక గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు పోలీసులు. సూట్‌కేసులో తీసుకొచ్చి అతి క్రూరంగా కాల్చి చంపినట్లు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికలో ఆ బాడీ మహిళదిగా నిర్ధారణ అయ్యింది. దీంతో చివరకు ట్రేస్ అవుట్ చేసి ఆ బాడీ భువనేశ్వరిదిగా గుర్తించారు.
 
ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో నిందితుడు భర్త అని నిర్థారించుకుని అతడిని మూడురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తిరుపతి ఎస్పీ మీడియాకు చూపించారు. కన్నబిడ్డ ముందే అతి దారుణంగా తల్లిని చంపేశాడంటూ ఎస్పీ చెప్పుకొచ్చారు.