బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (08:40 IST)

కరోనాతో చనిపోయిందని నమ్మబలికి అడ్డంగా బుక్కైన భర్త...

కట్టుకున్న భార్యను కడతేర్చి.. కరోనా వైరస్ సోకి చనిపోయిందని అత్తమామలతోపాటు ఇరుగు పొరుగువారిని నమ్మించాడు. కానీ, అత్తింటివారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ మహిళ మృతి కేసులోని మిస్టరీ వీడిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పిల్లిగుంట తండాకు చెందిన విజయ్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన కవిత (21) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు హయాత్‌నగర్‌ పరిధిలోని ఇంజాపూర్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 18న కవిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 
 
ఈ నెల 10న ఆమెకు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌ వచ్చిందని, 18న వ్యాధి తీవ్రతతో చనిపోయిందంటూ విజయ్‌ అత్తింటివారిని నమ్మించాడు. దీంతో కరోనా ప్రొటోకాల్‌ పేరిట.. మృతదేహాన్ని ఆగమేఘాల మీద పిల్లిగుంట తండాకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. అయితే.. విజయ్‌, తన తల్లిదండ్రులు పరీక్షలు చేయించుకున్నా.. నెగటివ్‌ రావడంతో కవిత తల్లి అనుమానించారు. 
 
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి.. ఈ నెల 10వ తేదీన కవిత కరోనా పరీక్ష రికార్డులను పరిశీలించారు. ఆమెకు నెగటివ్‌ అని తేలడంతో.. విజయ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పిల్లిగుంట తండాలో పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు. భార్యపై అనుమానంతోనే కట్టుకున్నోడు ఈ పని చేయించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.