మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (20:01 IST)

స్వైన్ ప్లూ, డెంగ్యూ, మలేరియా నివారణకు తగిన ముందు జాగ్రత్తచర్యలు చేపట్టండి....

అమరావతి: రాష్ట్రంలో స్వైన్ ప్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలను ఆయా వ్యాధులపై పూర్తిగా చైతన్యంవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేఠ జిల్లా కలక్టర్లు, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను ఆదేశించారు. స్వైన్ ప్లూ, డెంగ్యూ, మలేరియా వ్యాధులపై గురువారం అమరావతి సచివాలయం నుండి ఆయన జిల్లా కలక్టర్లు, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో టెలీకాన్పరెన్సు నిర్వహించారు.
 
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ స్వైన్ ప్లూ వ్యాధికి సంబంధించి గత జనవరి నుండి ఇప్పటివరకూ రాష్ట్రంలో 157 కేసులు నమోదు కాగా వారిలో 91 మంది చికిత్సలు తీసుకుని ఆసుపత్రుల నుండి డిస్చార్జి కాగా 66 మంది ఇంకా చికిత్సలు పొందుతున్నారని ఇప్పటివరకూ ఈవ్యాధి సోకి 8 మంది చనిపోయారని తెలిపారు. కర్నూల్, చిత్తూర్, విశాఖపట్నం జిల్లాలో స్వైన్ ప్లూ వ్యాధి ప్రభావం అధికంగా ఉందని ఆయా జిల్లాల్లో ఈ వ్యాధిని నివారించేందుకు పెద్దఎత్తున అవసమరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలక్టర్లు,వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. పండుగలు, జాతరలు వంటి సందర్భంగా సమీప రాష్ట్రాల నుండి ఇక్కడకు ఇక్కడ నుండి ఆయా ప్రాంతాలకు ప్రజలు వెళ్లి రావడం వంటి కారణాలవల్ల ఈవ్యాధి సోకే వీలుందని కావున అలాంటి సందర్భాలు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
 
ముఖ్యంగా గ్రామ,పట్టణ స్థాయిలో ఇంటింట అవగాహనా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టి ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేయాలన ఇందుకుగాను డ్వాక్రా,డ్వాక్వా సంఘాలు, ఎఎన్ఎంలు,ఆషా వర్కర్లను వినియోగించాలని సిఎస్ పునేఠ చెప్పారు.ఈవ్యాధులపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అవసరమైన కరపత్రాలు,గోడపత్రికలు వంటి ప్రచార సామాగ్రిని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలకు పంపడం జరిగిందని వాటిని గ్రామ స్థాయి వరకూ పంపిణీ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా అన్ని బస్, రైల్వే స్టేషన్లు ఇతర జనసమ్మద్ధత అధికంగా ఉండే ముఖ్య కూడల్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు ద్వారా అవగాహన చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎవరైనా మూడు రోజులకు మించి దగ్గు,జ్వరం, గొంతి నొప్పి వంటి సమస్యలతో బాధబడుతుంటే అలాంటి వారిని వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి అవసరైన వైద్య సేవలు అందించేలా చూడలాని ఆదేశించారు.
 
రాష్ట్రంలో 16 బోధనాసుపత్రులతోపాటు తిరుపతిలోని స్విమ్స్  ఆసుపత్రిలో స్వైన్ ప్లూ వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన టెస్టింగ్ సౌకర్యాలున్నాయని స్వైన్ ప్లూ అనుమానిత కేసులు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రుల్లో చికిత్సలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు.జిల్లా స్థాయిలో సూపర్ వైజరీ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు వివిధ ఎన్జిఓలు తదితరలు సహకారంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సిఎస్ చెప్పారు.
 
డెంగ్యూ, మలేరియా వ్యాధులపై సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈఏడాది ఇప్పటి వరకూ 5 వేల 250 మలేరియా, 3 వేల 627 డెంగ్యూ కేసులు నమోదు కాగా మరణాలేమీ సంభవించ లేదని అన్నారు.ఈవ్యాధులు ప్రభలకుండా నివారించేందుకు గ్రామ,పట్టణ ప్రాంతాలన్నిటిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని,డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని,ఇళ్ల పరిసరాలు, ఇతర చోట్ల నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పారు.చెరువులు,ఇతర నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల లార్వా పెరగకుండా నివారించేందుకు గంబూజియా చేపలను,ఆయిల్ బాల్స్ వాటిలో వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.స్వైన్ ప్లూ వ్యాధి నివారణపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారని కావున జిల్లా కలక్టర్లు,వైద్య ఆరోగ్యం,పంచాయితీరాజ్,మున్సిపల్ పరిపాలన తదితర అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిఎస్ పునేఠ ఆదేశించారు.అనంతరం కర్నూల్, చిత్తూర్, విశాఖపట్నం జిల్లాల కలక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రస్తుతం స్వైన్ ప్లూ వ్యాధికి సంబంధించి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు,వ్యాధి ప్రభలతను సిఎస్ కు వివరించారు.