ఆఫ్ఘన్‌లో తాలిబన్ దెబ్బ... హైదరాబాద్ బిర్యానీకి దెబ్బ!!
ఆఫ్ఘన్‌లో తాలిబన్ దెబ్బకు, హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ మారిపోతోందా? అసలు దీనికి దానికి లింక్ ఏంటి? అవును గమ్మత్తయిన ఈ లింక్ ఏంటో మీరే చదవండి.
ప్రపంచంలో భోజన ప్రియులు ఎవరు హైదరాబాద్ కు వచ్చినా తప్పకుండా అడిగే వంటకం... ధమ్ బిర్యానీ! ఇక్కడి బిర్యానీ విదేశాలకూ ఎగుమతి అవుతోంది. హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితే చాలా మందికి వెంటనే ఆకలి వేసేస్తుంది. బిర్యానీ టెస్ట్ అంటే హైదరాబాదీ బిర్యానీదే అనేలా ఉంటుంది. ఇప్పుడు మన బిర్యానీ రుచి మారిపోతుందనిపిస్తోంది. అవును.. మీరు విన్నది నిజమే.. బిర్యానీ టేస్ట్ మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన మన బిర్యానీ రుచిని దెబ్బతీయబోతోంది.
హైదరాబాద్ బిర్యానీలో మాంసం, బాస్మతి రైస్‌లే ప్రధానమైనాచ ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్‌ది కీలక పాత్ర. ఎండు ద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని ఎలా ఉపయోగిస్తారనేదే బిర్యానీ రుచికి కీలకం. హైదరాబాద్ బిర్యానీకి ఆ రుచి రావడానికి కారణం ఈ డ్రైఫ్రూట్స్. ఈ బిర్యానీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ లో చాలా వరకూ ఆఫ్ఘన్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఈ తాలిబన్ రాక్షస పాలనతో అవి మనకు దొరికే పరిస్థితి లేదు. దొరికినా విపరీతమైన ఖరీదుగా మారిపోయాయి. హైదరాబాద్ బిర్యానీలో వాడే ఈ డ్రైఫ్రూట్స్ కి ఉన్న డిమాండ్ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తులు కొందరు నగరంలో డ్రైఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు. వారు అక్కడ నుంచి వీటిని తీసుకు వచ్చి ఇక్కడ హోటళ్లకు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ భయానక పరిస్థితిలో వారు అక్కడికి వెళ్లడం లేదా అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురావడం జరిగే పని కాదు.
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో అన్నీ స్తంభించిపోయాయి. రవాణా సౌకర్యాలు పూర్తిగా లేకుండా పోయాయి. ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ తో దౌత్య సంబంధాలు బాగా ఉండేవి. ఇప్పుడు తాలిబన్ రాకతో ఇది మారిపోయింది. భారత్ కు తాలిబన్ కు మధ్య చాలా అంతరం ఉంది. ఉగ్రవాద ముద్ర ఉన్న తాలిబన్ తో సఖ్యత చేసే పరిస్థితి భారత్ కు లేదు. దీంతో ఎప్పటికి ఈ పరిస్థితులు చక్కబడతాయనేది చెప్పలేని పరిస్థితి. అందుకే ఆ ఎఫెక్ట్ మన బిర్యానీపై నేరుగా పడబోతోంది.డ్రైఫ్రూట్స్ దొరకకపోతే చేసేదేమీ లేదని నగరంలోని హోటల్ వ్యాపారాలు అంటున్నారు. అసలే కరోనా దెబ్బకు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది అనుకుంటే, తాలిబన్ దెబ్బ పడింది అని హోటల్ నిర్వాహకులు ముఖ్యంగా ప్రత్యేకంగా బిర్యానీ హోటల్స్ వారు చెబుతున్నారు.
పరిస్థితులు చక్కబడే సూచనలు కనబడటం లేదనీ.. చాలా కాలం ఈ సంక్షోభం కొనసాగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. బిర్యానీ తయారీలో రుచికి వాడే డ్రై ఫ్రూట్స్ కు ప్రత్యామ్నాయం లేదని అందువల్ల అవి లేకుండానే బిర్యానీ తయారు చేసే పరిస్థితి వచ్చిందనీ వారంటున్నారు. దీంతో బిర్యానీ రుచి తగ్గుతుందని చెబుతున్నారు. ఇదీ...హైదరాబాద్ బిర్యానీకి, ఆఫ్ఘాన్ తాలిబాన్ దెబ్బకు లింక్ మరి.