తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న ఇండియన్స్
ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న భారతీయులను భారత వైమానిక దళం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. కాబుల్ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం భారత్‌కు చేరుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కాబుల్ నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొనివున్న విషయం తెల్సిందే. అఫ్గాన్ తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి అరాచక పాలనలో జీవించలేక ప్రజలు దేశాన్ని వీడుతున్నారు.
ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.