శాంతివచనాలు చెపుతున్న తాలిబన్లు, వారిని మేకవన్నె పులిలా చూస్తున్న ప్రపంచం
శాంతివచనాలను తాలిబన్లు చెపుతున్నప్పటికీ మేకవన్నె పులిలా చూస్తోంది ప్రపంచం. పాకిస్తాన్ ఏకంగా ఆఫ్ఘన్ సరిహద్దు వెంట పెద్ద కంచెలను ఏర్పాటు చేసుకుంది. ఇక చైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ తాలిబన్లు చైనాకి వ్యతిరేకంగా సుమారు 400 మందికి తర్ఫీదు ఇచ్చినట్లు అనుమానిస్తోంది.
అటువైపు రష్యా తజకిస్తాన్ లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఇరాన్ దేశం పరిస్థితి మరోలా వుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్దసంఖ్యలో తమ దేశానికి శరణార్థులు వచ్చే అవకాశం వుందని ఆందోళన చెందుతోంది. మొత్తమ్మీద తాలిబన్ల నేతృత్వంలో ప్రభుత్వం అంటే.. ప్రపంచం భయంభయంగా చూస్తోంది.
మరోవైపు తాలిబన్ల ఆధీనంలోని ఆఫ్గనిస్థాన్‌లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యావద్దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించిన తాలిబన్లు మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించారు. ఎక్కడా విధ్వంసాలకు తెగబడకుండా శాంతిజపం చేస్తున్న తాలిబన్లు స్త్రీలు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కావాలంటూ తమ సహజ స్వభావానికి విరుద్ధంగా పిలుపునివ్వడం అంతర్జాతీయ నిధుల కోసమేనన్న అనుమానం రేకెత్తిస్తోంది.
తాలిబన్ల పడగ నీడలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గంభీరంగా కనిపించింది. నగర వీధులలో అనేక మంది తుపాకులను చేతపట్టుకుని గస్తీ తిరిగారు. అధిక శాతం ప్రజలు భయంతో ఇళ్ళకే పరిమితం కాగా కొంతమంది స్త్రీల చేతికి సంకెళ్ళు వేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్సించి నిరసన తెలిపారు.
రెండు దశాబ్దాలుగా అనుభవిస్తున్న హక్కులన్నీ ఇకపై అందని ద్రాక్షేనన్న ఆందోళన దేశవ్యాప్తంగా మహిళల్లో కనిపిస్తోంది. కానీ ఇస్లామిక్ చట్టాలను గౌరవించి ఆఫ్గనిస్తాన్ మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించారు. ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రకటించిన తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు.
తమ నుంచి ప్రపంచ దేశాలకు ఎలాంటి హాని జరగదని చెబుతున్నారు. మహిళల హక్కులను తాము గౌరవిస్తామని.. అయితే అవి ఇస్లామిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. ఒకవైపు గంభీర వాతావరణం.. మరోవైపు శాంతిజపం తాలిబన్లలో కొత్త కోణాన్ని చూపిస్తోంది.