మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (09:53 IST)

ప్రతిభకు అడ్డురాని కడుపేదరికం... టాపర్‌ను చదివించలేని తల్లిదండ్రులు

సాధారణంగా పబ్లిక్ పరీక్షలు అంటే విద్యార్థుల్లో వణుకు మొదలవుతుంది. విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతారు. ఒత్తిడికి లోనవుతారు. పొద్దస్తామనం చదవమని ఒత్తిడి చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు వంచిన మెడ ఎత్తకుండా పుస్తకాల పురుగులై పోతారు. అయినా పరీక్షల్లో అత్తెసరు మార్కులతో పాస్ అవుతుంటారు. 
 
కానీ, చన్నై నగర శివారు ప్రాంతమైన నెసప్పాక్కం సమీపంలోని చూలైపాల్లం అనే ప్రాంతానికి చెందిన కె. భరతన్ అనే విద్యార్థి విషయంలో ఇది పూర్తి వ్యతిరేకం. ప్రతిభకు పేదరికం ఏమాత్రం అడ్డుకాదని భరతన్ నిరూపించాడు. ఇటీవల వెల్లడైన పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఒకవైపు తండ్రి అంగవైకల్యంతో బాధపడుతున్నా, మరోవైపు తల్లి దినకూలీగా వెళ్లి కుటుంబ భారాన్ని పోషిస్తున్నా.. ఆ యువకుడు మాత్రం చదవుల్లో సత్తా చాటాడు. కానీ, పైచదవులు చదివించలేమనీ, అందువల్ల చదువు మానేసి కూలిపని చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ బాలుడు తనకు తెలిసిన వారిద్వారా మీడియాను ఆశ్రయించడంతో అతని దీనగాథ వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై భరతన్ తండ్రి కె.ఎస్.కుమార్ మాట్లాడుతూ, ప్లస్ టూ వరకు చదువుకున్న తమ పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాల్సివుంది. ఆమె పెళ్లి కోసం డబ్బు కావాలి. అందుకే చదువు మానేసి పనికి వెళ్ళమని చెబుతున్నాం. కానీ, 90 శాతం మార్కులు సాధించాడు. నేను ఇంజనీర్‌ను అవుతానని పదేపదే చెబుతుంటాడు. తమలాంటి పేదల పిల్లలు అలాంటి లక్ష్యాలను చేరుకోవడం కష్టం. పైగా, కుమార్తెకు పెళ్లి చేయాల్సివుంది. ఇలాంటి పరిస్థితుల్లో నా కుమారుడిని ఎలా చదివించాలో అర్థంకావడం లేదు అని ఆయన వాపోయారు. 
 
కాగా, భరతన్ మొత్తం 600 మార్కులకు గాను 537 మార్కులు సాధించాడు. అయినప్పటికీ ఆ కుర్రోడు తల్లితో ఇప్పటివరకు తన సంతోషాన్ని పంచుకోలేదు. దీనికి కారణం తల్లి అందుబాటులో లేకపోవడమే. ఆమె మరో ప్రాంతంలో ఉండే కళ్యాణమండపంలో పాచిపని చేస్తూ రెండు రోజులుగా ఇంటికిరాలేదు. కానీ, తమ బిడ్డ సాధించిన మార్కుల  సంగతి మాత్రం మరో వ్యక్తిద్వారా భార్యకు భర్త చేరవేయగా, ఆమె తెగ సంతోషపడిపోయింది.
 
ఇకపోతే, కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే 4833 మంది విద్యార్థుల్లో భరతన్ ఒక్కడే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు. 'నేను ఐదో తరగతిలో ఉండగా తొలిసారి కంప్యూటర్ చూశాను. మా ఇంటిలో కంప్యూటర్ లేదు. అయినప్పటికీ తన క్లాస్ టీచర్ల సహాయంతో కంప్యూటర్ శిక్షణ పొందాను' అని చెప్పుకొచ్చాడు. ఈ విద్యార్థి కుటుంబం చూలైపల్లం అనే ప్రాంతంలో ఒక చిన్నపాటి గదిలో నివశిస్తోంది.