మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 9 మే 2019 (17:03 IST)

ఫ్రూటీ కోసం వెళితే... ఏడేళ్ల బాలుడుపై అత్యాచారం.. హత్య

కామాంధుల ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయి. ఏడేళ్ల బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడి తలపై బండరాయి మోది చంపేసిన ఘటన హైదరాబాద్ పహాడిషరీఫ్‌లో జరిగింది. కర్ణాటకకు చెందిన బాషా కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. పహాడిషరీఫ్ ప్రాంతంలోని ముస్తఫాహిల్స్ ప్రాంతంలో భార్య, నలుగురు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. 
 
రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఫ్రూటీ తెమ్మని 50 రూపాయలు చేతిలో పెట్టి బాలుడు యాసిన్‌ను దుకాణానికి పంపారు. రాత్రివేళ ఒంటరిగా వెళ్తున్న బాలుడ్ని గమనించిన కామాంధులు బలవంతంగా బాలుడ్ని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. చెట్ల పొదలలో ఉన్న స్థలం చుట్టూ ప్రహరిగోడ, రెండు గేట్లు ఉన్న ఆ నిర్జన ప్రాంతానికి బాలుడిని పట్టుకెళ్లారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో డాబాపై ఉన్న ఓ మహిళ ఇదంతా గమనించి బిగ్గరగా కేకలు వేసింది. 
 
బాలుడ్ని కిడ్నాప్ చేసి ఈడ్చుకుపోతుండటంతో ఏడుస్తాడేమోనని భావించి బాలుడి తలపై బండరాయి పడేసి చంపేసి పరారయ్యారు. చీకట్లో పారిపోతున్న ఆ హంతకులను వెంబడించారు జనం. అప్పటికే పారిపోవడంతో చీకట్లో వారిని గుర్తించలేకపోయామని చెప్తున్నారు. బాలుడు దారుణ హత్యకు గురైన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. పసివాడిని కర్కశంగా చంపేసిన ఆ కిరాతకుల్ని పట్టుకుంటామంటున్నారు పోలీసులు. 
 
నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో అత్యాచారాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు. చీకటి పడితే ఈ ప్రాంతానికి చేరుకునే అసాంఘికశక్తులు గంజాయి, మద్యం తాగుతూ వీరంగం చేస్తుంటారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.