శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (19:21 IST)

కొడాలి అండ‌తోనే కాసినో... చంద్రబాబుకు నిజనిర్థారణ కమిటీ నివేదిక

గుడివాడ క్యాసినో వ్యవహారంపై పోరాటం కొనసాగించాలని టిడిపి నిర్ణయించింది. గుడివాడ క్యాసినోపై టిడిపి నిజనిర్థారణ కమిటీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబుకు తమ నివేదిక అందజేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహణ, మంత్రి కొడాలినాని ప్రమేయంపై సేకరించిన సమాచారాన్ని సభ్యులు రిపోర్ట్ రూపంలో అధినేతకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో అందజేశారు.


గుడివాడ పర్యటనలో పోలీసులు తమను అడ్డుకున్న విధానం, అక్కడ జరిగిన దాడిపై అధినేతకు వివరించారు. తమ పరిశీలన, వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన సమాచారం ప్రకారం, మంత్రి కొడాలి నాని అండదండలతోనే క్యాసినో నిర్వహణ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వీడియోలు, ఇతర ప్రాంతాల నుంచి క్యాసినో నిర్వహణ కోసం వచ్చిన యువతులు, ఇతర నిర్వాహకుల వివరాలను ఆధారాలతో నివేదికలో పొందుపరిచారు. 
 
 
వందల కోట్లు చేతులు మారిన వ్యవహారం కావడంతో పాటు సంస్కృతిని దెబ్బ తీసేలా మూడు రోజుల పాటు కార్యకలాపాలు జరిగాయని నిజనిర్థారణ కమిటీ సభ్యులు అధినేతకు వివరించారు. దాడులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ సభ్యులు చేసిన పోరాటాన్ని చంద్రబాబు కొనియాడారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కోరుతూ గవర్నర్ ను కలవాలని నేతలకు చంద్రబాబు సూచించారు.


క్యాసినో వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. చంద్రబాబును కలిసి నివేదిక ఇచ్చిన వారిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర, మాజి ఎంపి కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ మహిళా నాయకురాలు సునీత ఉన్నారు.