మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే.. సర్కారుకు చెంపదెబ్బ వంటిది : టీడీపీ నేత గంటా

ganta
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా హైకోర్టు స్టే విధించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాము ఆరంభం నుంచి చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తే ఇలానే ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు.
 
"మీ స్వార్ధ రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. అమాయక రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. అమరావతి మాస్టర్ ప్లానులో ఎలక్ట్రానిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో కనీస పరిజ్ఞానం లేకుండా ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని చూశారు. మీ ప్రయత్నాలను గురువారం హైకోర్టు తప్పు పట్టి నిర్మాణాలపై స్టే విధించింది. 
 
ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు పట్టాలు ఇవ్వదల్చుకుంటే.. ఆర్-5 జోను పరిధిలో లేనివాటిని ఇచ్చి మీ విశ్వసనీయత చాటుకోండి. అంతేకానీ పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ధ్వంసం చేయొద్దు. చట్టాలు మీకు చుట్టాలు కావనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా నెత్తికెక్కిన మీ కళ్లను కిందకుదించండి" అని గంటా శ్రీనివాసరావు ట్విట్ చేశారు.