ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజు రూ.43 వేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కళాశాలలు మరో 10 శాతం రుసుములు పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, రుసుముల నియంత్రణ కమిషన్‌ను ఆదేశించింది.
ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి. న్యాయస్థానం ప్రతిపాదించిన రుసుములపై తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీంతో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం సవరించింది.