శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (18:16 IST)

హైకోర్టు తరలింపుపై ఏపీ సర్కారు, ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి : కేంద్రం

aphighcourt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వుందని కేంద్రం వ్యాఖ్యానించింది. హైకోర్టు తరలింపు అంశం తమ చేతుల్లో లేదని చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలనే విషయంలో నిర్ణయాన్ని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వుందని కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఏపీ హైకోర్టును తరలించే అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని చెప్పారు. 
 
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందన్నారు. అయితే, అక్కడ నుంచి కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారని, అయితే, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. 
 
అమరావతిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ సీఆర్డీఏను ఆదేశించిందని గుర్తుచేశారు. అదేసమయంలో హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో ఏపీ హైకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సివుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.