నిన్నకాక మొన్నవచ్చావ్.. బాబుకే పాఠాలు చెప్తావా: అచ్చెన్నాయుడు
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.500 కోట్లు దోచుకున్నారనీ, పోలవరం అంచనాలు పెంచేశారనీ, నీరు చెట్టు పథకం కింద రూ.18 వేల కోట్ల నిధులు స్వాహా చేశారంటూ మంత్రి అనిల్ చేసిన ఆరోపణలను అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు.
దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ, తమకు అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని విషయాల్లో తాము ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తున్నామన్నారు. 'అధ్యక్షా.. మా పరిస్థితి ఎలా అయిందంటే.. అదృష్టం కొద్ది ఎలాంటి అనుభవం లేని ఓ వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయి మా బాబు(చంద్రబాబు)కే నీతులు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది. నిజంగా బాధగా అనిపిస్తోంది.
రాష్ట్ర సమస్యలపై ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ నిన్న కాక మొన్న ఇరిగేషన్ మంత్రిగా అయి చంద్రబాబు నాయుడికే ఇరిగేషన్ మీద పాఠాలు చెబుతుంటే కొంచెం బాధగా అనిపిస్తోంది అధ్యక్షా' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.