శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (10:52 IST)

అట్టుడికిన ఏపీ అసెంబ్లీ.. ఆ బిల్లును అడ్డుకున్న తెదేపా సభ్యులు

ntr health university
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గత రెండు దశాబ్దాలుగా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చేందుకు పూనుకుంది. ఇందుకోసం అత్యవసరంగా అన్‌‍లైన్ కేబినెట్ మీటింగ్‌ను రాత్రిక రాత్రి ఏర్పాటుచేసింది. ఇందులో ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది ఏపీలో తీవ్ర వివాదాస్పదమైంది. 
 
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఇటు ప్రజలతో పాటు అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకే అడుగు వేసింది. ఈ పేరు మార్పు సవరణ బిల్లుని బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. సభాపతి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. 
 
వైకాపా ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేరు మార్చొద్దని, ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సవరణ బిల్లు ప్రతులను లాక్కొనేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్సార్ కడప జిల్లా పేరును తాము మార్చలేదని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు గుర్తు చేశారు. 
 
ప్రశ్నోత్తరాల మధ్యే సభలో గందరగోళం నెలకొంది. మరోపైపు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టామని చెప్పారు. ఈ గందరగోళం మధ్య సభను 10 నిమిషాల సేపు స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయినప్పటికీ సభలో రభస కొనసాగింది.