సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (14:16 IST)

జగన్ రెడ్డి పీడక – లూఠీ నామ సంవత్సరం 2021: ఎమ్మెల్సీ అశోక్ బాబు

2021 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పీడక-లూఠీ నామసంవత్సరంగా ప్రజలకు దారుణమైన చేదుజ్ఞాపకాలను మిగిల్చిందని టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు విమ‌ర్శించారు. గ‌త‌ సంవత్సరం రాష్ట్రం జగన్ అనే వైరస్ తో పీడింపబడిందని, వ్యవస్థలు సహా, రాష్ట్రంలోని ప్రజలంతా సదరు వైరస్ బారినపడిన వారేనన్నారు. ఒక్కఛాన్స్ అని నమ్మి 151 సీట్లు ఇచ్చిన పాపానికి ఆంధ్రులంతా బ్రిటీష్ వారిపాలన కంటే, దారుణమైన క్రూరమైన పాలన రుచి చూశారని టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు వాపోయారు.
 
 
మోసకారీ సంక్షేమనామ సంవత్సరం... అప్పులనామ సంవత్సరం. అభివృద్ధిశూన్యనామ సంవత్సరం.. సంక్షేమం సర్వనాశనమైన సంవత్సరం. అంతులేని అవినీతి రాజ్యమేలిన సంవత్సరం.  విధ్వంసక, వికృత, వినాశ నామసంవత్సరం... హత్యలు, అత్యాచారాల నామసంవత్సరం... అమాయకులు లెక్కకు మిక్కిలి బలైనసంవత్సరం.  మాటతప్పి, మడమతిప్పిన మదోన్మత్తుల నామసంవత్సరం...అంటూ అశోక్ బాబు పెద్ద లిస్టే చ‌దివారు.
 
 
కరోనావేళ అన్నిరాష్ట్రాలు బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీగా సరుకులు నగదు సహాయం చేశాయ‌ని,  కాని ఏపీలో జగన్ ప్రభుత్వం కేంద్రం పంపిన సహాయమే ఇచ్చింది గాని, ఇతర రాష్ట్రాల మాదిరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేద‌న్నారు. కనీసం కరోనామృతులకు దహనసంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేద‌ని పేర్కొన్నారు. కరోనాతో కుదేలైన కుటుంబాలపై కనికరం లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నుల మోత మోగించింద‌ని, భారీగా ధరలు పెంచింద‌ని ఆరోపించారు.
 
 
మీడియాపై దాడి చేస్తూ జీవో నెం. 2430 తెచ్చార‌ని, అసెంబ్లీకి మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించి పత్రికా స్వేచ్ఛను హరించార‌న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లు, దోపిడీ నోట్లు, పోలీసు, రౌడీ మూకలతో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఎన్నికలను ప్రహసనంగా మార్చార‌ని విమ‌ర్శించారు.