షో మాస్టర్లు వద్దు... టాస్క్ మాస్టర్లు కావాలి.. లేదంటే టీడీపీ మటాష్ : కేశినేని నాని

Last Updated: మంగళవారం, 9 జులై 2019 (12:49 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాలంటే పని చేసే సత్తా ఉన్న నేతలు (టాస్క్ మాస్టర్లు) కావాలని, షో మాస్టర్లు అక్కర్లేదని ఆ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.

గత కొంతకాలంగా కేశినేని నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రతి అంశంపైనా ఆయన స్పందిస్తున్నారు. చివరకు పార్టీ అంతర్గత విషయాలపై సైతం ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీకి షో మాస్టర్లు అక్కర్లేదనీ, టాస్క్ మాస్టర్లు కావాలని, అపుడే టీడీపీని కాపాడుకోగలమన్నారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలు లేకపోలేదు.

గత ఎన్నికల్లో టీడీపీ నేత నాగూర్ మీరాను విజయవాడలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నాని ప్రతిపాదించారు. దీన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో విషయం టీడీపీ అధినేత చంద్రబాబు వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న లాంటి షో మాస్టర్లు కాకుండా తనలాంటి కష్టపడి పనిచేసేవారే పార్టీకి అవసరమని టీడీపీ అధిష్ఠానానికి కేశినేని పరోక్ష సందేశాన్ని పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :