చంద్రబాబుకు మరో షాక్ : జనసేనలోకి వంగవీటి రాధా!  
                                       
                  
				  				   
				   
                  				  ముగిసిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యంగా, శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అవమానకరమైన ఓటమిని చవిచూసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో కేవలం 22 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. 
				  											
																													
									  
	 
	ఈ ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అనేక మంది తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరిపోయారు. సోమవారం మరో సీనియర్ నేత, పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ కూడా కాషాయం కండువా కప్పుకోనున్నారు. 
				  
	 
	ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వైకాపా నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పైగా, టీడీపీకి భవిష్యత్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో ఆయన పక్క చూపులు చూస్తున్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇందులోభాగంగా, సోమవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. పూర్తిగా రహస్యంగా జరిగింది. కాగా, ఈరోజు సాయంత్రం లేదా రేపు వంగవీటి రాధ జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.