శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (19:47 IST)

రోజాను ఓడించేందుకు ఆమెను రంగంలోకి దించుతున్న చంద్రబాబు.. ఎవరు?

వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాను నగరిలో ఓడించే అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈసారి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి టికెట్ ఇస్తారా లేక కొత్తవారిని తెరపైకి తీసుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఏపీలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఇందుకోసం తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. 
 
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ... అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానిపై ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించుకుంటోంది. మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా... వైసీపీలో ఉంటూ తనను ఎక్కువగా టార్గెట్ చేసే నేతలను ఈసారి ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న చంద్రబాబు... వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాను ఓడించే అంశంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని టాక్ వినిపిస్తోంది.
 
ముద్దుక్రిష్ణమనాయుడు మరణం కారణంగా ఈసారి నగరి టీడీపీ సీటును ఆయన ఇద్దరి కుమారుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున డాక్టర్ సుభాషిణి పోటీలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 
 
క్షత్రియ సామాజికవర్గానికి చెందిన సుభాషిణి, ఆమె భర్త ఇద్దరూ డాక్టర్లే కావడం... నియోజకవర్గంలో వారికి మంచి పేరు ఉండటం కూడా వారికి కలిసొస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణికి ఎమ్మెల్సీ పదవి ఉండటంతో... కొత్తవారికి అవకాశం ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ తరపున టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందుండే రోజాను ఓడించేందుకు అధికార పార్టీ ఏవిధంగా ముందుకు వెళుతుందో చూడాలి.