ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.. నారా లోకేష్ పిలుపు
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలనే తపన కువైట్‌లో స్థిరపడ్డ తెలుగువారిలో కనిపిస్తోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. కువైట్‌లో ఉన్న ఆంధ్రులతో శంఖారావం సభను నిర్వహించారు. కువైట్ శంఖారావం సందర్భంగా అక్కడ స్థిరపడిన తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను.
అక్కడ వుంటున్నప్పటికీ జన్మభూమిలో జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలనే తపన వారిలో కనిపించిందని చెప్పారు. అందుకే ఏపీలో ఈ నాలుగన్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించానని తెలిపారు. ప్రపంచంలోని 135 దేశాల్లో ఉన్న 25లక్షల మంది ప్రవాసాంధ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. ఏ దేశంలో వున్న ప్రవాసాంధ్రులంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ చేస్తూ.. మహానాయకుడు సినిమా గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలకు ఈ సినిమా ఓ కమనీయ దృశ్య కావ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల్లోంచి పుట్టిన ఒక నాయకుడి ప్రయాణం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, వెరసి నందమూరి అభిమానులకు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కమనీయ దృశ్య కావ్యమని తెలిపారు.