శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:59 IST)

మాఘ పౌర్ణమి... ఊరు ఖాళీ... ఎందుకు?

హిందువులు పౌర్ణమిలన్నింటి కంటే మాఘ పౌర్ణమిని చాలా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులనీ ఈ మాఘమాసంలో జలంలో ఉంచుతారనీ, తత్ఫలితంగా మాఘ స్నానం చాలా ప్రత్యేకమైనదనీ చెప్తూ ఉంటారు.


అటువంటి మాఘ మాసంలో పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాల వల్ల వ్యాధులు, చికాకుల నుండి విముక్తి లభించడంతోపాటు మరణానంతరం కోరుకునే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనీ పురాణాలలో చెప్పబడి ఉంది. అయితే... ఇంతటి విశిష్టమైన మాఘ పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మాత్రం 400 ఏళ్లుగా ఒక వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది. 
 
వివరాలలోకి వెళ్తే... అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మాఘ పౌర్ణమి రోజున పూర్తిగా ఖాళీ అయిపోతుంది. గ్రామంలోని ప్రజలందరూ కుల, మత భేదం లేకుండా తెల్లవారుజామునే హాజీవలి దర్గాకు వెళ్లిపోతారు. తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీని ప్రకారం గ్రామంలోని చిన్నా పెద్దా అంతా సూర్యోదయానికి ముందే ఇళ్లకు తాళాలు వేసి, పశువులను కూడా తమతోపాటు తీసుకొని హాజీవలి దర్గాకు చేరుకుంటారు. 
 
గ్రామస్థులంతా కలిసి అక్కడే వంటావార్పూ చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు. సూర్యాస్తమయం తర్వాతే గ్రామానికి తిరిగివెళ్తారు. గ్రామానికి చేరుకున్న తర్వాత, ప్రతి ఒక్కరూ గడప గడపకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే ఇంట్లోకి వెళ్లి లైట్లు వేస్తారు. ఆ తర్వాత ఇళ్లను శుభ్రం చేసి పొయ్యి వెలిగించడం జరుగుతుంది. 
 
400 ఏళ్లుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని తామంతా క్రమం తప్పకుండా పాటిస్తున్నామనీ, దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందనీ  గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ఆచారాన్ని అతిక్రమించిన కొందరు కష్టాలు కొనితెచ్చుకోవడంతోపాటు అకాల మరణం పొందారని చెబుతున్న వీళ్లు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని నమ్మి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమిరోజున ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నట్లు తెలియజేసారు.