బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 9 నవంబరు 2021 (20:44 IST)

కుప్పం మునిసిపల్ కమిషనర్‌కు చీర, జాకెట్, గాజులు ఇచ్చేందుకు టిడిపి యత్నం

చిత్తూరు జిల్లాలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. నామినేషన్ ఉపసంహరణ కాస్త రచ్చకు దారి తీసింది. 14వ వార్డు వైసిపి అభ్యర్థి ఏకగ్రీవంగా ప్రకటించడంతో కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమిషనర్‌కు ఏకంగా చీర జాకెట్ గాజులు ఇచ్చేందుకు ప్రయత్నించారు టిడిపి నాయకులు. 
 
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు సందర్భంగా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మొత్తం 25 వార్డుల్లో 24 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 14వ వార్డులో వైసిపి అభ్యర్థి మునుస్వామికి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు.
 
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీమంత్రి అమరనాథరెడ్డి, ఇతర టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, పులివర్తి నాని, గౌనివారి శ్రీనివాసులు కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళిపోయారు. కమిషనర్‌ను అసభ్యపదజాలంతో దూషించడం మొదలెట్టారు.
 
దీంతో పోలీసులు అతికష్టం మీద వారిని పట్టుకుని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా ప్రధాన ఎన్నికలను తలపించే విధంగా ఉంది. 
 
కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా వైసిపి జెండాను ఎగురవేయాలన్నదే అధికార వైసిపి నేతల ఆలోచన. కానీ టిడిపి జెండానే కుప్పంలో ఎగరాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ముఖ్య నేతలందరినీ కుప్పంకు పంపించి ప్రస్తుతం అక్కడే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
 
కానీ ఈ ఎన్నికలతోనే చంద్రబాబుకు చెక్ పెట్టి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తామన్న సంకేతాన్ని చూపించాలన్న ఆలోచనలో ఉన్నారట అధికార పార్టీ నేతలు. దీంతో స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబునాయుడు పర్యటించిన ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. ఎన్నికలు జరిగే 24 వార్డుల్లో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. మరి కుప్పం మునిసిపాలిటీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో?